(Local) Thu, 09 Apr, 2020

హామీల‌కు చట్ట బ‌ద్ద‌త ఏది..?

December 05, 2018,   2:47 PM IST
Share on:
హామీల‌కు చట్ట బ‌ద్ద‌త ఏది..?

గెలుపే ల‌క్ష్యంగా  పావులు క‌దుపుతూ అన్ని రాజ‌కీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు. అందులో బాగంగానే ప్ర‌జ‌ల మెప్పు పొందేందుకు అల‌వి కాని హామీల‌తో అర చేతిలో వైకుంఠం చూపిస్తారు. అంద‌లం ఎక్క‌గానే ఇచ్చిన హామీల‌ను తుంగ‌లో తొక్కుతారు. ఒక సారి అధికారం చేజిక్కించు కున్నామా..! ఐదు సంవత్స‌రాల వ‌ర‌కు త‌మ‌ను గ‌ద్దె దింపే వాడు లేడ‌నే ధీమాతో ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా ప్ర‌స్థుత రాజ‌కీయ పార్టీల ప‌రిస్థితి. ఇలాంటి అబ‌ద్ద‌పు హామీల‌తో అంద‌లం ఎక్కిన పార్టీల మెడ‌లు వంచేది ఎవ‌రు..? ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవ‌రిని అధికారంలో కూర్చోబెట్టాలనేది నిర్ణ‌యించేది ప్ర‌జ‌లు. అందుకే వారి ప్ర‌స‌న్నం చేసుకునేందుకు పోటీలు ప‌డి హామీల వ‌ర్షం కురిపిస్తున్నారు. మ‌న రాష్ట్రం మ‌న ప‌రిపాల‌న అంటూ ఒక‌రు, రామ రాజ్యం తెస్తాం అంటూ మ‌రొక‌రు, ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చే ప్ర‌భుత్వం అంటూ.. ఏది ఏమైనా ఇలా ప్ర‌జ‌ల‌ను మోసం చేసి అధికారం చేజిక్కించుకుని ఆ హామీల‌ను అట‌కెక్కించ‌డం ప‌రి పాటే . ఇక వాటి అమ‌లుకై  ప్ర‌తి ప‌క్షం ఎంత‌ పోరాటం చేసినా అధికార పార్టీ పెడ చెవిన పెడుతంది. మ‌రి ఆ హామీల‌కు చ‌ట్ట బ‌ద్ద‌త క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. 
ఆకాశామే హ‌ద్దు :
అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్ర‌ధాన పార్టీల అధినేత‌లు జ‌నాక‌ర్ష‌క ప‌థాకాల‌తో ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు తమ మేనిఫెస్టోలు ప్ర‌వేశ పెడుతుండ‌టం ప‌రిపాటే, కాని ప్ర‌స్థుతం తెంలంగాణ అసెంబ్లీకి జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌ను  త్వర‌లో జ‌ర‌గ‌నున్న పార్లమెంట్ ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్‌గా పోల్చుతూ ఒక ఛాలెంజ్ గా  తీసుకున్న కాంగ్రేస్, భార‌తీయ జ‌న‌తా పార్టీలు, ఇటు ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీలు   పోటీ ప‌డుతున్నాయి. కేసీఆర్ ను గ‌ద్దె దించాల‌ని అటు జాతీయ పార్టీలు,  అధికారం తిరిగి చేజిక్కించుకోవాల‌ని ఇటు టీఆర్ఎస్ పార్టీ హామీలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదలకు ముందే.. ఆసరా ఫించన్లను రూ.2 వేలకు పెంచుతామని ప్రకటించింది. దీంతో జాగ్రత్త పడిన కేసీఆర్ దాన్ని రూ.2016 చేస్తామన్నారు. ఇదే అంశాన్ని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపర్చింది. వికలాంగ ఫించన్లూ  అంతే,  కాంగ్రెస్ రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామనగా.. టీఆర్ఎస్ రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామంటోంది. వృద్ధాప్య ఫించన్ల అర్హత వయసును కాంగ్రెస్ 65 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు తగ్గిస్తామనగా.. 57 ఏళ్ల నుంచే ఫించన్ ఇస్తామని టీఆర్ఎస్ చెబుతోంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో వెల్లడించగా.. మేం 61 ఏళ్లకు పెంచుతామని టీఆర్ఎస్ చెబుతోంది. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో డబుల్ బెడ్రూం ఇళ్ల హామీని నెరవేర్చడంలో విఫలమైన కేసీఆర్ సర్కారు.. మరోసారి అధికారం కట్టబెడితే సొంత ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు సాయం చేస్తామని ప్రకటించింది. ఈ హామీ కూడా కాంగ్రెస్ పార్టీదే. రైతు బంధు కింద సాయం పెంపు హామీ కూడా ఇరు పార్టీలు 
పోటీప‌డి హామీలు గుప్పిస్థున్నాయి. ఆచ‌ర‌ణ సాధ్యం కాని మేనిఫెస్టోను కాంగ్రేస్ పార్టీ విడుద‌ల చేసి ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తుద‌ని విమ‌ర్శించిన‌ కేటీఆర్, తాజాగా వాటికి 16 రూపాయ‌లు జోడిస్తూ  టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుద‌ల చేసింది. వారికి సాధ్యం కాద‌ని విమ‌ర్శించిన టీఆర్‌ఎస్ పార్టీకి ఎలా సాధ్యం అవుతుంది..? అధికారం చేజిక్కించు కోవ‌డాని పోటీలు ప‌డి ఇస్తున్న హామీల‌ను వీరు అధికారంలోకి వ‌స్తే ఎలా అమ‌లు ప‌రుస్తారో ఆలోచించాల్సిన అవ‌స‌రం వుంది.ఇచ్చిన హామీల‌ను అధికారంలోకి వ‌చ్చాక  టీఆర్ఎస్ పార్టీ అమ‌లు ప‌ర‌చ‌లేద‌నే విమ‌ర్శ‌లున్నాయి.
ప్ర‌లోభాలు ...
ఏది ఏమైనా అధికార ల‌క్ష్యంతో ప‌లు పార్టీల నేత‌లు ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేస్తున్నారు. ప‌ది రూపాయ‌లు పెట్టి ఒక వ‌స్తువు కొనాలంటే అర గంట ఆలోచించే మ‌నం,  మ‌న ఐదేళ్ళ భ‌విష‌త్‌ను నిర్ణ‌యించే ఎన్నిక‌ల్లో ప్ర‌లోభాల‌కు లొంగ‌కుండా ఆలోచించి త‌మ విలువైన ఓటును స్వ‌ఛ్ఛందంగా వేయాల్సిన అవ‌స‌రం వుంది. అప్పుడే రాష్ట్ర అభివృద్ది, ప్ర‌జ‌ల జీవ‌న శైలి మార్పు చెందుతుంది.
హామీల అమ‌లుకు ప‌ర్య‌వేక్ష‌ణ :
గెలుపే ల‌క్ష్యంగా  పావులు క‌దుపుతూ అన్ని రాజ‌కీయ పార్టీలు ప్ర‌జ‌ల మెప్పు పొందేందుకు అల‌వి కాని హామీల‌తో అర చేతిలో వైకుంఠం చూపి అంద‌లం ఎక్క‌గానే ఇచ్చిన హామీల‌ను తుంగ‌లో తొక్కుతున్నారు. ఒక సారి అధికారం చేజిక్కించు కున్నామా..! ఐదు సంవత్స‌రాల వ‌ర‌కు త‌మ‌ను గ‌ద్దె దింపే వాడు లేడ‌నే ధీమాతో ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా ప్ర‌స్థుత రాజ‌కీయ పార్టీల ప‌రిస్థితి. ఇలాంటి అబ‌ద్ద‌పు హామీల‌తో అంద‌లం ఎక్కిన పార్టీల మెడ‌లు వంచేది ఎవ‌రనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌తీక అయిన భార‌త దేశంలో ప్ర‌జాస్వామ్య బ‌ధంగా ఎన్నుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్న ఎన్నిక‌ల సంఘం ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు ప‌ర్చ‌డంలో అల‌స‌త్వం పాటిస్తున్న అధికార పార్టీని గ‌ద్దె దింపే అధికారం ఇచ్చి వుంటే అప్పుడు వివిధ పార్టీల నాయ‌కులు తప్పుడు హామీల‌తో  గ‌ద్దెనెక్కెందుకు  సాహ‌సించ‌ర‌నేది ప‌లువురి అభిప్రాయం. దీంతో అన్ని పార్టీలు చెప్పిదే చేస్తాయి, చేసేదే చెబుతాయ‌ని అప్పుడే ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుందని సామాజిక వేత్త‌లంటున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.