(Local) Fri, 13 Dec, 2019

కేంద్రంలో మారుతున్న రాజ‌కీయ‌ ప‌రిణామాలు

May 22, 2019,   11:13 AM IST
Share on:
కేంద్రంలో మారుతున్న రాజ‌కీయ‌ ప‌రిణామాలు

దేశంలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు కాక పుట్టిస్తున్నాయి. రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.గ‌తంలో దేశ‌వ్యాప్తంగా రెండు లేద‌ మూడు విడ‌త‌ల్లో ఈ ప్ర‌క్రియ పూర్త‌య్యేది. కాని ఈసారి మాత్రం ఏడు విడ‌తల్లో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించారు. దాదాపు రెండు నెల‌ల కాలం ప‌ట్టింది. ఈ రెండు నెల‌ల నుంచి నాయ‌కుల్లో ఇటు ప్ర‌జ‌ల్లో ఉత్కంఠరేపుతున్న ప్ర‌శ్న ఒక్క‌టే, కాబోయే ప్ర‌ధాని ఎవ‌ర‌ని. మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీనే తిరిగి అధికారంలోకి వ‌స్తుంద‌ని ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు వెల్ల‌డిస్తుండ‌గా, ప్ర‌తిప‌క్ష కాంగ్రేస్ పార్టీ మాత్రం వాటిని విశ్వ‌సిస్తుండ‌టం లేదు. ఈ నెల 23న వెల్ల‌డి కానున్న ఫ‌లితాల్లో ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ వ‌చ్చే అవ‌కాశం వుండ‌దని, హంగ్ ఏర్ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌నేది వారి వాద‌న‌.

హంగ్ వ‌స్తే ప‌రిస్థితి ఏంటి...?

మ‌రో రెండు రోజుల్లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్న నేప‌ధ్యంలో అధికార, ప్ర‌తిప‌క్షాలలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు స‌రైన మెజార్టీరాని ప‌రిస్థితుల్లో ఏం చేయాల‌నే దానిపై, ఎవ‌రికి వారే వ్యూహ ప్ర‌తి వ్యూహాలకు ప‌దునుపెడుతున్నారు. బీజేపీయేతర పార్టీల‌కు చెందిన ముఖ్యమంత్రులతో, త‌ట‌స్థ పార్టీల నాయ‌కుల‌తో మాట్లాడాల్సిందిగా కాంగ్రెస్ సీనియర్ నేతలైన చిదంబరం, గులాంనబీ ఆజాద్, ఆంటోనీలతో పాటు మరికొంత మందిని ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దింపింది. ఇందులో భాగంగానే  ప్రాంతీయ పార్టీల‌ అధినేతలైన కేసీఆర్, వైయస్ జగన్, అఖిలేష్ యాదవ్, మాయావతి, మ‌మ‌తా బెన‌ర్జి, నవీన్ పట్నాయక్‌లాంటి నేతలతో చర్చలకు పంపాలని యోచిస్తోంది. ఇదివ‌ర‌కే జ‌గ‌న్ కి, ఇటు కేసీఆర్ కి సోనియాగాంధీ ఉత్త‌రాలు రాసి మ‌ద్ద‌తు కోరిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఎన్డీయేతర నేతలతో ఈ రోజు అమిత్ షా విందు రాజ‌కీయాలు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. 

కాంగ్రేస్ గ‌త‌ చ‌రిత్ర ఏంచెబుతోంది

భార‌త దేశానికి స్వాతంత్రం వ‌చ్చిన నాటి నుండి ఎకువ శాతం దేశాన్ని పాలించింది కాంగ్రేస్ పార్టీనే.  అందులోనూ...  కాంగ్రెస్‌కు పూర్తి స్థాయి మెజార్టీ వచ్చినప్పుడు మాత్రమే జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు ప్రధాన మంత్రులుగా బాధ్యతలు చేప‌ట్టారు. ఇక‌పోతే రాజీవ్ గాంధీ మ‌ర‌ణానంత‌రం పివి న‌ర‌సింహారావు ప్ర‌ధాని గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో మైనార్టీ ప్ర‌భుత్వాన్ని పూర్తికాలం పాలించిన ఘ‌నత ఆయ‌న‌ది. అలాగే కాంగ్రేస్ పార్టీ తో ప్రాంతీయ పార్టీలు జ‌త‌క‌లిసి యూపీఏ కూట‌మిగా ఏర్పాటు చేశారు. ఈ కూట‌మి మ‌ద్ద‌తుతోనే మన్మోహన్ సింగ్‌ ప్రధాని అయ్యారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ 197 స్థానాలు గెలిచింది. కానీ ప్రధాని పదవి చేప‌ట్ట‌లేకపోయింది. ఇక వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోయాకా, కాంగ్రేస్ పార్టీ మ‌రోపార్టీకి స్వల్పకాలిక మద్దతు ఇచ్చి ఆ తర్వాత 1991లో ఎన్నికలు వచ్చేలా పరిస్థితిని సృష్టించింది. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారాన్ని కైవ‌సం చేసుకున్న‌ప్పటికీ యూపీఏ చైర్ ప‌ర్స‌న్ సోనియాగాంధీ మాత్రం ప్రధాని కాలేకపోయారు.   కాంగ్రెస్ సొంతంగా మెజార్టీ స్థానాలు గెలవకపోవడమే దీనికి కారణం. దీంతో యూపీఏ ప్రభుత్వాన్ని నడిపించేందుకు పార్టీకి విధేయుడు, సౌమ్యుడుగా పేరున్న మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా తెరపైకి తీసుకొచ్చారు.  2009లో కూడా మన్మోహన్ సింగ్ నే ప్ర‌ధానిగా కొన‌సాగించారు. 

కాంగ్రెస్‌కు 272 స్థానాలు వస్తేనే... 

ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 272 సీట్లు వస్తేనే రాహుల్ ప్రధాని అవుతార‌ని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలా కాని ప‌క్షంలో యూపీఏ నుంచి కానీ బయట పార్టీల నుంచి కానీ ప్రధాని అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది. ప్ర‌ధాని అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది డిసైడ్ చేసే అవ‌కాశం కూడా కాంగ్రేస్ పార్టీనే తీసుకునే అవ‌కాశం లేక‌పోలేదు. మొత్తానికి ఈ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లుగా జరగడంతో ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారుతున్నాయి. ఇది పసిగట్టిన జాతీయ పార్టీలు అప్పుడే తమదైన శైలిలో విందు రాజ‌కీయాలు, లాబీయింగ్ చేస్తున్నారు. ఇక‌పోతే  ఈ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి కాంగ్రేస్, బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి ఈ త‌రుణంలో ప్రాంతీయ పార్టీలు ఎవరివైపు మొగ్గు చూపుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.