(Local) Fri, 05 Jun, 2020

సీబీఐ పై యుద్దం ప్ర‌క‌టిస్తున్న రాష్ట్రాలు

February 05, 2019,   2:33 PM IST
Share on:
సీబీఐ పై యుద్దం ప్ర‌క‌టిస్తున్న రాష్ట్రాలు

దేశంలో ఎక్క‌డ అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చినా వాటి నిగ్గు తేల్చేది సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ) సంస్థ. ఈ సంస్థని స్వ‌తంత్రంగా ప‌ని చేయ‌కుండా కేంద్ర ప్ర‌భుత్వాల చెప్పుచేత‌ల్లో ప‌ని చేస్తున్నాయ‌ని, అవి స‌రిగా త‌మ క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తించ‌డం లేద‌ని, ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధం ప్ర‌క‌టిస్తున్నాయి. మొన్న ఆంధ్రప్ర‌దేశ్ నేడు ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ సంస్థ‌పై యుద్ద భేరీ మోగించాయి. భార‌తదేశంలో అత్యంత ప‌ఠిష్ట‌మైన ఆర్బీఐ, సీబీఐ సంస్థ‌లు. దేశంలో ఎక్క‌డ అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారిని విచారించే అధికారం సీబీఐ సంస్థకున్న ప్ర‌త్యేక‌థ‌. అంటే ఇది ఒక స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌లిగిన సంస్థ‌. ఇందులో ఏ ప్ర‌భుత్వాలు త‌లదూర్చే అవ‌కాశం వుండేది కాదు. ఇది ఒక‌ప్ప‌టి మాట‌. కాని కాలం మారుతున్న‌ట్టుగానే సీబీఐ విష‌యంలోనూ కేంద్ర ప్ర‌భుత్వాల పెత్త‌నం పెరిగి పోతుంది. దీంతో స్వ‌యం ప్ర‌తిప‌త్తి గల సంస్థ‌ల‌ను నిర్వీయం చేస్తూ ఆయా ప్ర‌భుత్వాలు త‌మ ఇష్టానుసారంగా వాడుకుంటున్నాయి. 2014 వ‌ర‌కు కేంద్రంలో అధికారంలో ఉన్నయూపీఏ ప్ర‌భుత్వం వంత‌యింది. ఇప్పుడు అధికారంలో ఉన్నన‌రేంద్ర మోడి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్ర‌భుత్వం వంతు అవుతుంద‌నే అరోప‌ణ‌లున్నాయి. కేంద్రంలో ఏ ప్ర‌భుత్వం అధికారంలో వున్నా వారి వారి అవ‌స‌రాల‌కు ఉప‌యోగిస్తున్నార‌నే అప‌వాదు నేటి ప్ర‌భుత్వాలు మూట‌గ‌ట్టుకుంటున్నాయి. దీంతో స్వ‌యం ప్ర‌తిప‌త్తి గ‌ల సంస్థ‌లు వాటి మ‌నుగ‌డ ప్ర‌శ్నార్ధ‌కంగా త‌యార‌వుతుంద‌నే అభియోగాలున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన రిజ‌ర్వు బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ రాజీనామా, సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ ఆలోక్ వ‌ర్మ రాజీనామా లాంటి ఘ‌ట‌న‌లే అందుకు నిద‌ర్శ‌నమ‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు.

సీబీఐ అధికారాలు - రాష్ట్ర సంబంధాలు :

ఢిల్లీ మినహా మిగతా రాష్ట్రాల్లో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాల 'సాధారణ అనుమతి తీసుకోవ‌ల్సిన అవసరం ఉంటుంది. వాటి అనుమ‌తి లేనిదే ఆయా రాష్ట్రాల్లో సోదాలు నిర్వ‌హించే అధికారం ఆ సంస్థ‌కు ఉండ‌దు. అలాంట‌ప్పుడు ఆయా రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వశాఖలు, కేంద్రప్రభుత్వ రంగసంస్థల్లోపనిచేసే ఉద్యోగుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేసే అవకాశం సీబీఐకి ఉండదు. ఇటీవలికాలంలో ఎన్డీఏ కూట‌మి నుండి వైదొలిగిన తెలుగుదేశం పార్టీ, త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌ధ్యంలో తమ పార్టీ నేతల నివాసాలు, కార్యాలయాల్లో ఐటి శాఖ సోదాలు నిర్వ‌హిచ‌డం, భవిష్యత్తులో మరిన్ని సోదాలు జరుగుతాయనే పథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో 'సిబీఐ కి నో ఎంట్రీ - జిఓ ఇచ్చి' సోదాలు చేపట్టే అధికారాన్ని సీబీఐకి నిరాకరిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలిసిందే. గతంలో ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ ను ఉపసంహరించుకుంటూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణ‌యాన్ని ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెన‌ర్జీ స‌మ‌ర్దించింది.

నేడు శ్చిమ బెంగాల్ :

శారద చిట్‌ఫండ్ కుంభకోణంపై విచారణ నేపథ్యంలో కేంద్రం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల మధ్య వివాదం నెలకొనడం తెలిసిందే, ఈ క్ర‌మంలో కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు ఆదివారం సీబీఐ అధికారులు వెళ్లగా వారిని పశ్చిమబెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీబీఐని అడ్డంపెట్టుకుని కేంద్రం తమపై జులుం చూపుతోందని ఆరోపిస్తూ మమత ఆ రోజు రాత్రి నుంచే సత్యాగ్రహ దీక్ష ప్రారంభించారు. దీంతో దేశ‌వ్యాప్తంగా ప్ర‌కంప‌ణ‌లు సృషించింది. అటు పార్ల‌మెంటును సైతం కుదిపేసింది. మ‌మ‌త దీక్ష‌కు ప‌లు పార్టీలు సంఘీభావం ప్ర‌క‌టించడంతో ఆదిశ‌గా మ‌రికొన్ని రాష్ట్రాలు ఈ జాబితాలో  చేరే అవ‌కాశం వున్న‌ట్టు ప‌లువురు ఆరోపిస్తున్నారు.

సీబీఐ'తో రాజకీయాలు..

'సీబీఐ పంజరంలో చిలుక' అని సుప్రీం కోర్టే వాఖ్యానించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అటువంటి సీబీఐని పావుగా చేసుకుని కేంద్రప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను వేధిస్తోందనే విషయాన్ని దేశవ్యాప్తంగా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా మమత అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో పాలక పక్షమైన తెదేపా అటువంటి వాదననే వినిపిస్తోంది. వాస్తవానికి పలు ప్రతిపక్ష పార్టీల నేతలపై సీబీఐ దర్యాప్తులు ఇటీవల వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌కు మద్దతుగా మమత దీక్షకు దిగారు. పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్‌ పాలనను అవినీతి మయంగా చూపి రాష్ట్రంలో పాగా వేయాలని భాజపా ప్రయత్నిస్తోందని దీదీ భావిస్తున్నారు. అందుకే అదే సీబీఐని కేంద్రం పావుగా వాడుకొంటోంది అంటూ నిరసన దీక్షకు దిగారనీ, దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలకు నాయకత్వం వహించేలా వ్యూహరచన చేస్తున్నారనీ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కోర్టు అనుమతితో సోదాలు :

రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నఏ రాష్ట్రంలోనైనా సుప్రీంకోర్టు అనుమ‌తితో సోదాలు నిర్వ‌హించే అధికారం సీబీఐకి వుంద‌నేది న‌గ్న‌స‌త్యం. అవ‌స‌రం అనుకుంటే దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు నుండి అనుమ‌తి తీసుకుని విచార‌ణ కొన‌సాగించే అవ‌కాశం వుంటుంది. దీనికి అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌హ‌క‌రించాల్సిందే.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.